బీజేపీ మహిళా నేత ఖుష్బూ సుందర్ కి కీలక పదవి లభించింది. ఆమెను జాతీయ మహిళా కమిషన్ (NCW)సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఖుష్బూతో పాటు మమతా కుమారి, దెలీనా ఖోడ్బప్ ను కూడా కేంద్రం నామినేట్ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర మహిళా శిశు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 3 సంవత్సరాల పాటు ఖుష్బూ ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఖుష్బూ ధన్యవాదాలు ప్రకటించారు.
ఇంత గొప్ప బాధ్యతను కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ నాయకత్వంలో నారీశక్తిని పరిరక్షించేందుకు తనవంతుగా కష్టపడతానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు మహిళలను దుర్భాషలాడుతున్నాయని ఖుష్బూ మండిపడ్డారు. జాతీయ మహిళా కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ అని, ఏ రాజకీయ పార్టీ కూడా మహిళను కించపరచకుండా చూసుకోవాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రతీ మహిళా మాట్లాడే విధంగా ప్రోత్సహిస్తానని, అప్పుడే మహిళలు తమని తాము రక్షించుకోగలుగుతారని ఖుష్బూ అభిప్రాయపడ్డారు. ఇదే తన మొదటి క్యాంపెయిన్ అని ప్రకటించారు.