కోవిడ్ అంతానికి భారత ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించనుంది. శుక్రవారం నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా ఈ బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి 75 రోజుల వాటు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఇక తెలంగాణలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ అందుబాటులో వుంటుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో, యూనివర్శిటీల్లో వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించింది. ఆయా సొసైటీలకు, సంస్థలకు చెందిన వారు 040-24651119 నెంబర్లో కూడా సంప్రదించవచ్చని ప్రభుత్వం సూచించింది. కేసులు పెరగడం లేదని, బూస్టర్ వద్దన్న నిర్లక్ష్య ధోరణి వద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక… ప్రభుత్వాసుపత్రిలో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని తాము విన్న వించామని, ఆలస్యంగానైనా.. కేంద్రం అనుమతించడం సంతోషకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అర్హులైన వారందరికీ బూస్టర్ డోసు వుంటుందని హరీశ్ రావు తెలిపారు.