రెండో రోజూ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే… వ్యాపారవేత్త అదానీ విషయంలో హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనని విపక్ష పార్టీలు సభలో పట్టుబట్టాయి. బీఆర్ఎస్ తో పాటు విపక్ష నేతలన్నీ దీనిపై చర్చించాల్సిందేనని వాయిదా తీర్మానాన్ని సభలో ఇచ్చాయి. అదానీ కంపెనీలపై చర్చను చేపట్టాల్సిందేనని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాలను కూడా అడ్డుకున్నారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు.
సభ్యులందరూ తమ తమ సీట్లలో కూర్చోవాలని, వెల్ నుంచి వెళ్లాలని స్పీకర్ ఓం బిర్లా కోరినా… సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే వున్నారు. చివరికి లోకసభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. ఇక… రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ ధన్కర్ రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు సభ ప్రారంభం కంటే ముందు కాంగ్రెస్ అధ్యక్షతన విపక్ష పార్టీల ఎంపీలు సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. ఈ సమావేశానికి ఎన్సీపీ, శివసేన, వామపక్షాలు, డీఎంకే, టీఎంసీ తదితర పక్షాలు హాజరయ్యారు. అయితే… సభలో అదానీ నివేదికపై చర్చించాల్సిందేనని పట్టుబట్టాల్సిందేనని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే సభల్లో నివేదికపై చర్చ జరగాలని సభ్యులు పట్టుబట్టారు. తాము కొన్ని అంశాలపై స్పీకర్ కు వాయిదా తీర్మానాన్ని ఇచ్చామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ఎల్ఐసీ, ఎస్బీఐతో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వాయిదా తీర్మానం ఇస్తే.. నిరాకరణకు గురైందని ఖర్గే పేర్కొన్నారు.