కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల ఏకంగా రోడ్లపైనే కట్టెల పోయ్యిపై వంటావార్పు చేపట్టి, భోజనాలు చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్, ఘట్ కేసర్ లో మంత్రులు హరీశ్, మల్లారెడ్డి నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. అన్ని వర్గాలనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి, సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.
గత యూపీఏ (UPA) హయాంలో గ్యాస్‌పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని గుర్తుచేశా. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పూర్తిగా ఎత్తివేసిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు.
పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నల్లదుస్తులు ధరించి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బీజేపీకి హటావో దేశ్ కి బచావో అంటూ నినాదాలు చేశారు. నిత్యావసర ధరలను పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని మంత్రి తలసాని అన్నారు. ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని వెల్లడించారు. బీజేపీ(BJP) నేతలను అడ్డుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.