పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు డీజీపీ అంజనీ కుమార్ కి ఫిర్యాదు చేశారు. రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు. రేవంత్ రెడ్డి నిన్న పాదయాత్రలో ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయం, నివాసాన్ని గ్రైనైడ్స్ పెట్టి పేల్చి వేయాల్సిందిగా కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చట్ట సభల్లో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాల్సిందిగా కోరడమంటే , ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించాలని కోరారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్ రావు, ఎల్.రమణ, తాతా మధు, శంభిపూర్ రాజు తదితరులు డీజీపీ కార్యాలయానికి వెళ్లి, లిఖిత పూర్వకంగా ఆయనకు ఫిర్యాదు చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ జిల్లాలోని బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు రేవంత్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దహనం చేశారు. రేవంత్ పై పీడీ యాక్టు కింద కేసుపెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ములుగు జిల్లాలో సాగుతోంది. ఈ సందర్భంగా ములుగులో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన దుమారానికి, చర్చకు దారితీశాయి. ప్రగతి భవన్ ని నక్సలైట్లు పేల్చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు, ప్రజలకు ప్రగతి భవన్ ఏమాత్రం ఉపయోగపడదని, అలాంటప్పుడు ఆ ప్రగతి భవన్ ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను కూడా పేల్చేయాలని పిలుపునిచ్చారు.