భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) దేశమంతా శరవేగంగా విస్తరిస్తోంది. ఏపీ, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర నాందేడ్లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేలు బాల్క సుమన్, హన్మంతు షిండే, జోగురామన్న తదితరులు నాందేడ్లో పర్యటిస్తూ అక్కడి నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను సమన్వయం చేస్తున్నారు.
ఫిబ్రవరి 5న నాందేడ్లో గురుద్వార సందర్శన అనంతరం సీఎం కేసీఆర్ అక్కడ జరిగే సభలో పాల్గొని స్థానిక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తారు. గత వారం మహారాష్ట్ర నుంచి పలువురు నేతలు బృందాల వారిగా హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ను కలిసి పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో వారందరినీ నాందేడ్లో జరిగే సభలోనే పార్టీలో చేరాలని సీఎం సూచించడంతో సభ సందర్భంగా వారు పార్టీలో చేరనున్నారు.