ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని, ఈడీకి పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే… ముందస్తు షెడ్యూల్ ప్రకారం కొన్ని అపాయింట్స్, కార్యక్రమాలు వున్నాయని, రేపటి విచారణకు హాజరు కావాలా లేక నోటీసులపై లేఖ రాయాలా అనేది న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మార్చి 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ లో మహిళా బిల్లు కోసం దీక్ష చేపట్టామని.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు.
ఢిల్లీలో దీక్ష కోసం మార్చి 8వ తేదీనే ఢిల్లీ వెళ్లాల్సి ఉందని.. అయితే ఈలోపే ఈడీ నోటీసులు రావటంతో.. ముందస్తు కార్యక్రమాలపై పార్టీలోనూ.. న్యాయ నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని, దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని కవిత స్పష్టం చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (mlc kavitha) ఈడీ నోటీసులిచ్చింది. గురువారం విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ వ్యాపారి రామచంద్ర పిళ్లైతో కలిసి, కవితను విచారించనున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్ మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఆయన రిమాండ్ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించింది.