ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను( Farmers ) తప్పకుండా ఆదుకుంటామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఎలాంటి సహాయం చేయకున్నా రైతులను ఆదుకుంటున్నామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని స్పష్టం చేశారు.
పంట నష్టం అంచనాలు పూర్తయ్యాక రైతులను తప్పకుండా తప్పకుండా ఆదుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి బృందాలను పంపించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు. 32 జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయని, 72 లక్షల ఎకరాల్లో పంటలు వేశారన్నారు. దేశంలో అత్యధిక శాతం పంటలు వేసిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మూడు రోజుల క్రితమే రైతులను మంత్రులు పరామర్శించారని, ముఖ్యమంత్రి అన్ని జిల్లా కలెక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని వివరించారు.
80 వేల మంది రైతులకు చెందిన లక్ష 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, పంట నష్టం అంచనా వేస్తున్నారని తెలిపారు. రైతుల్ని కచ్చితంగా ఆదుకుంటామని, కేంద్ర ప్రభుత్వం కూడా నష్టాన్ని అంచనా వేసేందుకు టీమ్ లను పంపాలని కోరారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం వుందన్నారు. నిరుద్యోగులను అవమానపరిచే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, 95 శాతం తెలంగాణ వారికే ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్రం చర్యలు తీసుకుందని తెలిపారు.