భారత రాష్ట్ర సమితి ఎంపీలు, ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించారు. దీనిపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. తమకు రాష్ట్రపతి ముర్ముపై గౌరవం వుందని, తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్‌లో ఎండగడుతామని ప్రకటించారు.
అఖిలపక్ష సమావేశంలోనూ మా వైఖరి స్పష్టంగా చెప్పామని, గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకటించారు. ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపకపోతే ఎలా అని కేకే ప్రశ్నించారు. తెలంగాణలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. బడ్జెట్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోర్టులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కారణంగా ఆప్ ఇబ్బందులు పడుతుండగా.. కేరళ, తమిళనాడుల్లోనూ గవర్నర్ల కారణంగా ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శించారు.
రాష్ట్రపతి మీద, ఆమె ప్రసంగం మీద గౌరవం ఉందని నామా నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి నిన్న అఖిలపక్షంలో చెప్పినా ఇవాళ్టి ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. రైతుల సమస్యలపై కూడా ప్రస్తావించలేదన్నారు. ఇరిగేషన్ మీద మాట్లాడే హక్కు కేంద్రానికి లేదని చెప్పారు. తెలంగాణలో ఇరిగేషన్ రంగం అభివృద్ధి ఏంటో కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో ఎండగట్టాలని, అందుకు కలిసివచ్చే పార్టీలతో సమిష్టి వ్యూహాన్ని అనుసరించాలని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో నిన్న జరిగిన సమావేశానికి బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు హాజరయ్యారు.