కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఇక క్రియాశీల రాజకీయాలకు దూరంగా వుంటానని పరోక్షంగా కీలక వ్యాఖ్యలు బహిరంగంగానే చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శికరైపుర అసెంబ్లీ స్థానాన్ని ఖాళీ చేస్తున్నానని, ఇకపై తన స్థానం నుంచి తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్ర బరిలోకి దిగుతారని సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో వుండనని, విజయేంద్రే పోటీలో ఉంటారని విస్పష్టమైన ప్రకటన చేశారు.
తనకు ఇన్ని సంవత్సరాల పాటు ఎలాగైతే మద్దతిచ్చారో… తన కుమారుడు విజయేంద్రకు కూడా అలాగే మద్దతిస్తూ, ముందుకు నడిపించాలని యడియూరప్ప నియోజకవర్గ ప్రజలను కోరారు. లక్షకు పైగా మెజారిటీతో ఆయన్ను గెలిపించాలి పిలుపునిచ్చారు. ఇకపై తాను వారానికోసారి మాత్రమే నియోజకవర్గంలో పర్యటిస్తానని, విజయేంద్ర యాక్టివ్ గా వుంటాడనని యడియూరప్ప ప్రకటించారు. ఇక… కాంగ్రెస్ పై యడియూరప్ప విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు నేతలు పోట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ కర్నాటకలో బీజేపీదే అధికారమని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. మామూలు మెజారిటీతో కాదని, బంపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తామని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు.