ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనూహ్య మద్దతు లభించింది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. విపక్ష పార్టీల్లోని నేతలు ద్రౌపది ముర్ముకు మద్దతివ్వడం ఇదే ప్రథమం. అయితే.. తాము బీజేపీకి మద్దతుగానో.. విపక్ష నేతల కూటమికి వ్యతిరేకంగానో ఈ కీలక నిర్ణయం తీసుకోలేదని మాయావతి వివరించారు.
తమ పార్టీ సిద్ధాంతాలను దృష్టిలో వుంచుకునే ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. తమ ఉద్యమంలో గిరిజన వర్గం కూడా ఎంతో కీలకమని, ఎప్పుడూ అణగారిన వర్గాలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటామని అన్నారు. దళిత చేతుల్లో నాయకత్వం ఉన్న ఏకైక పార్టీ బీఎస్పీయేనని, అణగారిన వర్గాలకు మద్దతుగా ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా.. వారి వెంట నిలుస్తామని బీఎస్పీ చీఫ్ మాయావతి తేల్చి చెప్పారు.