Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బుద్ధం శరణం గచ్చామి…..

శ్రీలంక భిన్న సంస్కృతులకు ఆలవాలమైంది. ఓవైపు బుద్ధిజం రెండవ వైపు హిందూ మతం.  అదే విధంగా మసీదులు, చర్చిలు  శ్రీలంకలో దర్శనమిస్తాయి. అత్యధికులు అంటే 70% సింహళీయులు బౌద్ధ ధర్మాన్ని పాటిస్తుంటే శ్రీలంక తమిళలు హిందూమత విశ్వాసాలను నమ్ముతారు. అయితే అడుగడుగున గుడి ఉంది అనుకుంటే ఆ గుడులు బౌద్ధ మతానికి చెందినవే. ప్రతి ఊరిలో ముఖ్యమైన కూడళ్లలో, రోడ్డు పక్కకు బుద్ధ విగ్రహాలు దర్శనమిస్తాయి.

తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్టు, శ్రీలంక కేంద్ర సాంస్కృతిక నిధి (సిసిఎఫ్) సయోధ్య కారణంగా స్నేహపూర్వక  పర్యటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల మహిళా జర్నలిస్టుల బృందం శ్రీలంకలోని బౌద్ధాక్షేత్రాల సందర్శనకు వెళ్ళింది. భవిష్యత్తులో కూడా ఈ పర్యటనల ద్వారా పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు శ్రీలంక పర్యటిస్తారనే  ఆలోచనలు ఒక విధంగా సంతోషాన్ని ఇస్తున్నాయి. బౌద్ధం పుట్టింది భరత ఖండమే  అయినప్పటికి పరిఢవిల్లిన దేశాల్లో శ్రీలంక అగ్రగామీగా నిలుస్తుంది. నాటి బౌద్ధ మత ప్రాభవం నేటికి ఇక్కడ కనపడుతుంది.   వీటి  సందర్శనకు అనేక దేశాల నుంచి బౌద్ధ మతస్తులు, బౌద్ధ సన్యాసులు, పర్యాటకులు శ్రీలంకకు నిత్యం వస్తారు.

నాంది ఎప్పుడు…….

బుద్ధుడు తన జీవితకాలంలో శ్రీలంకలో మూడు పర్యాయాలు పర్యటించి బోధనలు చేశారని శ్రీలంక చరిత్ర కారులు విశ్వసిస్తారు. అప్పటి పరిపాలకులు కొందరు భరత ఖండ మూలాలున్న వారవడం, రాణులు కూడా బౌద్ధంపట్ల ఆకర్షితులై, దాన్ని అవలంభించి,  ప్రోత్సహించడంతో శ్రీలంకలో అణువణువునా  బౌద్ధం కన్పిస్తుంది. ఇక్కడ బౌద్ధమతం  పరిఢవిల్లడం ఒక ఎత్తైతే, ఆ ఆనవాళ్లను వేల సంవత్సరాలుగా కాపాడుకోవడం మరొక ఎత్తని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కొలంబో, అనురాధపుర, కాండి, సిగిరియా, దంబుల్లా  లాంటి ప్రదేశాల్లో వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో బౌద్ధమత ఆనవాళ్లు ఇప్పటికీ స్పష్టంగా కనబడతాయి… ముఖ్యంగా అనురాధపుర.

అనురాధపురలోనే ఎందుకు……

శ్రీలంకలో పెద్ద తెగగా చెప్పబడే మహా వంశకు చెందిన రాజు విజయ ఇండో-ఆర్యాన్ కు చెందిన సింహపుర రాజు సింహబాహు కుమారుడు) 700 మంది అనునాయులతో ఉత్తరభారతం నుంచి వెళ్లి సామాన్య శకానికి పూర్వం(బిసిఇ) 5వ శతాబ్దంలో అక్కడ స్థిరపడ్డాడు. ఆ తర్వాతి కాలంలో విజయ సోదరుని కుమారుడు పాండు వాసుదేవ, గోకన్న అంటే ఇప్పటి ట్రి౦కోమలిలో స్థిరపడి రాజు విజయ శకాన్ని కొనసాగించాడు.  ఆ తర్వాత కూడా భారతదేశం నుంచి అనేక వలసలు జరిగినప్పటికీ మహా వంశ ఆధిపత్యం కొనసాగి౦దనేది చరిత్ర. అయితే బిసిఇ 10వ శతాబ్దంలోనే  అనురాధపుర ద్రావిడ మూలాలున్న రాజ్య౦గా ఉందనే చారిత్రక ఆధారాలు లభించాయని శ్రీలంక పురావస్తు పరిశోధకులు చెబుతారు. విజయ సామ్రాజ్యం అనురాధపుర నుంచి పాండుక్కభయ  వరకు విస్తరించింది. పట్టణీకరణ పెరిగింది.  బలమైన సింహాళ రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యానికి అనురాధపుర రాజధానిగా మారింది. మొట్టమొదటిగా మౌర్య చక్రవర్తి అశోకుడు ద్వారానే శ్రీలంకలోకి బౌద్ధమతం  ప్రవేశించింది. (బిసిఇ 268 – 232 కాలంలోనే) కళింగ యుద్ధానంతరం బౌద్ధం స్వీకరించిన అశోకుడు తన కుమారుడు మహేంద్రను, మరి కొంతమంది అనునాయులను  బౌద్ధమత వ్యాప్తికి శ్రీలంక  పంపించాడు. అప్పటి సింహాళ రాజు దేవానాం పియ తిస్స  వీరికి ఆహ్వానం పలికాడు.  మహామేఘ వనాన్ని  బౌద్ధ సన్యాసులకు దానమిచ్చాడు.  అక్కడే ఆరామాలు, కొలనులు నిర్మించి ఇచ్చాడు. ఆ తరువాత అది బౌద్ధులకు ప్రధాన కేంద్రంగా మారింది. అనంతరం అశోకుడు కుమార్తె సంఘమిత్రను, ఆమె  సోదరుడైన మహేంద్రుడు శ్రీలంకకి పంపాడు.  బోధ్ గయ లోని మూలబోధి వృక్షం నుంచి ఒక కొమ్మను తీసుకువెళ్లి సంఘమిత్ర అనురాధపురలో నాటింది. తర్వాతి కాలంలో జైన మతం కొంత మేరకు ప్రభావం చూపగలిగింది. కాని దుత్త గామి అభయ  శ్రీలంక ద్వీపం మొత్తాన్ని పాలించి, బలమైన రాజుగా ఎదగడంతో మిగిలిన ప్రాంతాలకు కూడా బౌద్ధం వ్యాప్తి చెందింది.

అనురాధపుర దర్శనీయం…..

ప్రస్తుతం ఇది శ్రీలంక మధ్య ఉత్తర ప్రావిన్స్ లో   ఉంది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో  దీన్ని గుర్తించింది.  దాదాపు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అనురాధపురాలో అడుగడుగునా బౌద్ధ విహారాలు, దగోబాలు (స్థూపాలు) కనిపిస్తాయి.

 పవిత్ర బోధి వృక్షం…

దీన్ని జయశ్రీ బోధి వృక్షంగా పిలుస్తారు. సంఘమిత్ర స్వయంగా దేవానాం పియ తిస్సకు అందజేసిన బోధి వృక్షం కొమ్మ నాటిన ప్రదేశమిది.  2200 సంవత్సరాల నుంచి ఈ వృక్షాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. బౌద్ధులు అతి పవిత్రమైన, పావనమైన ప్రదేశంగా భావించి ప్రార్థిస్తారు. నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి బౌద్ధులు  వచ్చి ప్రార్థనలు చేస్తారు.

 

రూపాన్ వెలిసేయ…

బిసిఇ 140లో అప్పటి రాజు దుత్తగామి దీన్ని ప్రారంభించగా చోళులు (భారతీయ తమిళులు) పూర్తి చేశారని చరిత్ర చెబుతోంది. దీనిని మహాస్తూపంగా  పిలుస్తారు.   దాదాపు 300 అడుగుల ఎత్తు ఉంటుంది. పూర్తి  శిధిలావస్థకు చేరుకున్న ఈ స్థుపాన్ని  శ్రీలంక ప్రభుత్వం పునరుద్ధరించింది. పర్వదినాల్లోనే కాక నిరంతరం బౌద్ధులు దీన్ని సందర్శిస్తుంటారు.

అభయగిరి  దగోబా….

దీన్నే అభయగిరి స్తూపంగా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్తూపం ఇది. దాదాపు 400 అడుగుల ఎత్తుతో బిసిఇ రెండవ శతాబ్దంలో నిర్మితమైంది. చూడగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. పూర్తి శిధిలావస్థకు చేరిన ఈ స్థూపం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పవిత్రమైన బౌద్ధ యాత్ర చేయాల్సిన ప్రాంతం. శ్రీలంకలో ఎన్ని బౌద్ధ క్షేత్రాలు సందర్శించినప్పటికి అభయగిరిని చూస్తేనే  ఆ యాత్రకు పరిపూర్ణత దక్కుతుంది అనేది  బౌద్ధుల విశ్వాసం.  శ్రీలంక కేంద్ర సాంస్కృతిక నిధి నుంచి దాదాపు 519.5 బిలియన్లు  కేటాయించి ఈ పునరుద్ధరణ పనులు చేపట్టారు. చుట్టూ  ఉన్న అప్పటి ఆరామాలు, భోజనశాలలు, నీటిపారుదల సౌకర్యాలు చూస్తే హంపి వైభవం గుర్తుకొస్తుంది.

లంకారామ , స్తూపారామ …..

ఈ రెండూ కూడా దర్శనీయ ప్రదేశాలే. అనురాధాపురకు వచ్చిన పర్యాటకులు ఈ రెండింటిని కూడా సందర్శిస్తారు. దేవుడికి వస్త్ర సమర్పణగా ఈ స్తూపాలకు మూడు రంగుల వస్త్రాన్ని కప్పి మొక్కు తీర్చుకుంటారు. వస్త్ర సమర్పణ అతి రమణీయంగా కనువిందు చేస్తుంది. ఇది చూసి తీరాల్సిన దృశ్యం.

సమాధి బుద్ధ…..

అనురాధాపురలో తప్పక దర్శించాల్సిన కేంద్రం మహా మేవనవ వనంలో ఉన్న సమాధి బుద్ధ. ఏడడుగుల ఎత్తులో సమాధి ముద్రలో (ధ్యానముద్ర) ఉన్న బుద్ధుడి ప్రతిమ మోములో  ఓవైపు దయ, రెండో వైపు ఆనందం ప్రతిబింబించేలా కేవలం పై పెదవి వంపుతో రెండి౦టి వ్యత్యాసాన్ని చెక్కిన శిల్పి  చాతుర్యానికి పాదాభివందనం చేయవచ్చు. అయితే సమాధి బుద్ధ ప్రతిమ హస్తముద్రికలు ఇతర ధ్యాన బుద్ధ ప్రతిమల్లోని ముద్రికలకు పూర్తి భిన్నంగా ఉంటాయి.  అలాగే ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్న మ్యూజియం, ఎలిఫెంట్ పాండ్స్ కూడా దర్శనీయ ప్రదేశాలే…

 

కొలంబోలో బుద్ధుడు…

శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో కూడా అనేక దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కెలనీయ, గంగారామయ. కొలంబోకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మందిరం 2500 సంవత్సరాల క్రితం నిర్మించారు. బుద్ధుడు తన జీవిత కాలంలో మూడు పర్యాయాలు  శ్రీలంక సందర్శించగా అందులో ఒకసారి కెలనీయకు  వచ్చి, ప్రసంగించారని శ్రీలంక వాసులు విశ్వసిస్తారు.  కెలనీ  రాజ మహా విహారయ గా పిలవబడే ఈ గుడిలో వినాయకుడు, ఏనుగులు, నాగ ప్రతిమలు  దర్శనమిస్తాయి. లోపలి చిత్రాలు తంజావూర్, ఎల్లోరా  చిత్రాలను పోలి ఉంటాయి. (వివిధ రంగుల్లో ) బుద్ధ భగవానుడికి సమర్పించడానికి విహారానికి సమీపంలో అమ్మే కమలాలు…. తెలుపు, ఎరుపు రంగుల్లోనే కాక అరుదైన గులాబీ, నీలం, పసుపు రంగుల్లో  కనువిందు చేస్తాయి. వీటిని  వీక్షించడానికి రెండు కళ్ళు చాలవు. బురద నుంచి కమలం వికసిస్తుంది. మురికి నీటిని స్వచ్ఛ౦గా మారుస్తుంది కమలం. స్వచ్ఛత, ఆధ్యాత్మిక ప్రేరణ, విశ్వసనీయతకు ప్రతికకగా భావించి భక్తులు కమలాలను బుద్ధ భాగవానుడుకి సమర్పిస్తారు.

గంగా రామయ..

గంగా రామయగా పిలిచే శ్రీ  గంగా రామ మహా విహారయా కొలంబో నగరంలో మరో అతి ముఖ్యమైన దర్శనీయ ప్రదేశం. గంగారామయ వివిధ కాలాల్లో మలిచిన బుద్ధప్రతిమలతో  అబ్బుర పరుస్తుంది. రత్నాలు, కెంపులు, పచ్చలు, గోమేధికం, పుష్యరాగం, కనక పుష్యరాగం అన్నింటికి మించి  నీలం రాళ్లతో చెక్కిన బుద్ధ  ప్రతిమలు  న భూతో న భవిష్యత్.  జ్ఞానోదయానికి ముందు నిరంతర ధ్యానంతో ఉపవాసంతో తనువును శుష్కింపజేసుకున్న (అన్వేషణలో భాగంగా తనకు తానే) బుద్ధ ప్రతిమను చెక్కిన శిల్పి చాతుర్య౦ వర్ణనాతీతం.  వివిధ కాలల్లో సేకరించిన వెండి, బంగారు, నవరత్నాలతో కూడుకున్న ఆభరణాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. గంగారామయ సందర్శన ఒక మధురానుభూతి.

శయన బుద్ధ… చంద్ర శిల …..

శ్రీలంకలోని అనేక బౌద్ధ రామాల్లో శయన  బుద్ధుడు దర్శనమిస్తాడు. విష్ణుమూర్తి శేష శయన  పవళింపు గుర్తుకు వస్తుంది. ప్రశాంత చిత్తంతో శయనించిన బుద్ధుడికి వివిధ రంగుల్లో ఉండే కమలాలను భక్తులు సమర్పిస్తారు. మరో విశేషమేమంటే కొన్నిచోట్ల తెరల మాటున శయన బుద్ధ ప్రతిమలు దర్శనమిస్తాయి. అలాగే ప్రతి బౌద్దారామం, బౌద్ధ ఆలయాల్లో  ప్రధాన ద్వారం వద్ద సందకద పహనలు – చంద్ర శిల వుంటుంది. అర్ధ చంద్రాకారంలో సంసార చక్రానికి సంకేతంగా రాతిలో చెక్కి వుంటుంది ఇది.

మరో ముఖ్య ప్రస్తావన…

శ్రీలంక బౌద్ధ విహారాల సందర్శనకు వెళ్ళిన తెలుగు మహిళా జర్నలిస్టులకు అరుదైన గౌరవం కూడా దక్కింది. దశాబ్దం క్రితం శ్రీ సిద్ధార్థ గౌతమ బాలీవుడ్ చిత్రానికి రెండో భాగంగా బాలీవుడ్- హాలీవుడ్ సంయుక్త నిర్మాణంలో అటు శ్రీలంక ఇటు నాగార్జునసాగర్ లోని బుద్ధవనంలో చిత్రీకరించడానికి  గాను అవగాహన ఒప్పంద సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా జర్నలిస్టు పాల్గొనే  అవకాశం లభించింది. ఆనాటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్, బుద్ధవనం ప్రత్యేక అధికారి లక్ష్మయ్య, చిత్ర హీరో గగన మాలిక్, నిర్మాత నవీన్ గుణ రత్నే హాజరయ్యారు. ప్రముఖ బౌద్ధ సన్యాసులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆశీస్సులు అందజేశారు.

చివరిగా … వారం రోజుల పాటు శ్రీలంకలో మహిళా జర్నలిస్టుల బృందం జరిపిన  పర్యటన  అనేక  అనుభవాలు, అనుభూతులను మూటగట్టుకుంది. శ్రీలంకను జీవితంలో  ఒకసారైన సందర్శిస్తే పర్యాటక ప్రేమికులకు అద్వితీయ అనుభూతిగా జీవితకాలం పాటు  నిలిచి ఉంటుందని చెప్పక తప్పదు.

 

పండలనేని గాయత్రి

స్వతంత్ర జర్నలిస్ట్

 

Related Posts

Latest News Updates