మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ భారతదేశ అభివృద్ధి పథంలో కొత్త శక్తిని నింపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ పునాది వేస్తుందని తెలిపారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మోదీ ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల జీవితాలను సులభతరం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నామని, ఈ బడ్జెట్ మధ్యతరగతి, పేదలు, రైతుల సహా మొత్తం సమాజం ఆశయాలను, కలలను సాకారం చేస్తుందని పేర్కొన్నారు. పన్ను రేటును తగ్గించామని, తదనుగుణంగా ప్రజలకు ఉపశమనం కలిగించామని మోదీ గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ గ్రోత్, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు గ్రీన్ జాబ్‌లను మరింత ప్రోత్సహించడం, మంచి భవిష్యత్తు నిర్మాణం కోసం ఈ బడ్జెట్ ఎంతో ఉపకరిస్తుందన్నారు.
కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై కీలక ప్రసంగం చేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా వుందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అభివర్ణించారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని, సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోందన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్లతో టాయ్ లెట్స్ నిర్మాణం చెపట్టామని, 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకాన్ని అందిస్తున్నామని వివరించారు. 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించామని పేర్కొన్నారు. విశ్వకర్మ కౌశల్ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నామని, ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2 లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని ప్రకటించారు.