నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 11 గంటలకు ఉపన్యసించనున్నారు. రాష్ట్రపతిగా ముర్ము బాధ్యతలను స్వీకరించిన తర్వాత పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటి సారి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎకనమిక్ సర్వేను సభ ముందు ప్రవేశపెట్టనుంది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గురువారం నుంచి ఉభయ సభల్లోనూ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. దీనిపై ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో జవాబులివ్వనున్నారు. ఈ ప్రసంగం పూర్తి కాగానే బడ్జెట్ పై చర్చ మొదలవుతుంది. దీనిపై ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ జవాబివ్వనున్నారు.
రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈ సారి బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గతంలోనే ప్రకటించారు. ట్వీట్ కూడా చేశారు. తొలి విడత ఫిబ్రవరి 14 వరకు, ఆ తర్వాతి విడత మార్చి 12 న మొదలై… ఏప్రిల్ 6 న ముగుస్తుంది. ఈ సమావేశాల్లో 36 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు తగిన కసరత్తు కూడా జరిగిందని పలువురు పేర్కొన్నారు. ఇదిలాఉంటే సమావేశాలు సజావుగా జరిగేందుకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి పహ్లాద్ జోషీ డిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, చైనా చొరబాట్లు, ఓబీసీ కుల గణన, అదానీ వ్యాపారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై పార్టీలు చర్చకు అడిగాయని, పార్లమెంట్లో ఏ అంశంపైన అయిన చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు.