షాపూర్ జీ పల్లంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. నిద్రలోనే తుదిశ్వాస విడిచారని అధికారులు ప్రకటించారు. పారిశ్రామిక రంగానికి పల్లోంజీ చేసిన సేవలకు గాను 2016 లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ తో సత్కరించింది. ప్రస్తుతం ఈయన సంపద విలువ 2.2 లక్షల కోట్లు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో పల్లోంజీ 125 వ స్థానంలో నిలిచారు.
ఇక.. 2021 లెక్కల ప్రకారం భారత్ లోని సంపన్నుల జాబితాలో పల్లోంజీకి 9 వ స్థానం దక్కింది. షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ 18 ప్రధాన కంపెనీలతో కూడిన ప్రపంచ వ్యాప్త సంస్థగా పేరు గడించింది. ఇంజినీరింగ్ నిర్మాణం, ఇన్ఫాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసుల్లో పల్లోంజీ సంస్థ సేవలందిస్తోంది.
50 దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. దాదాపు 50 వేలకు పైగానే ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ 18.4 శాతం షేర్లతో టాటా సన్స్ లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా వుంది.
తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాదు పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాలను కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది. ముంబైలోని ఆర్బీఐ భవనం, ది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ను కూడా ఈ సంస్థే నిర్మించింది. అబుదాబీ, ఖతర్, దుబాయ్ లో ఈ పల్లోంజీ సంస్థ విస్తరించింది.
1929 లో పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత లండన్ లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్య జరిగింది. కేవలం 18 సంవత్సరాల వయస్సులోనే కేరీర్ ను ప్రారంభించారు. క్రమక్రమంగా పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ఈయనకు ఇద్దరు కుమారులు. షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ. ఇద్దరు కుమార్తెలు. లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ. 2012 నుంచి 2016 వరకూ సైరస్ మిస్త్రీ టాటా గ్రూపు చైర్మన్ గా పనిచేశారు.