నూతన మద్యం పాలసీ అమలులో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 12 మందిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో వీరెవ్వరూ దేశం విడిచి వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. మరోవైపు సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంపై డిప్యూటీ సీఎం మనీశ్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. తాను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నానని, ఎక్కడికి రావాలో చెప్పాలంటూ ఏకంగా ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఇవేం నాటకాలు అంటూ ఫైర్ అయ్యారు. సీబీఐ తనిఖీలన్నీ విఫలమయ్యాయని, తమ నివాసంలో ఒక్క పైసా కూడా లభించలేదన్నారు.
భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యా, ఆరోగ్య రంగంలో మంచి పనితీరు కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేశారని సిసోడియా ఆరోపించారు. తనను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశముందని సిసోడియా సంచలన ప్రకటన చేశారు. నిర్బంధాలతో తమ పార్టీ మంచి పనులు చేయకుండా అడ్డుకోలేరని చెప్పారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రచురించడంతోనే తమపై మోదీ సర్కారు కక్ష సాధిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.