తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ హోదా పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అర్హత లేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ టుడు ప్రకటించారు. లోకసభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరానికి సంబంధించిన ప్రశ్న వేసినప్పుడు, కేంద్ర మంత్రి టుడు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ లేదని, అందుకే తాము ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది.
అనుమతులు అంటూ వుంటేనే ఈ ప్రాజెక్టును హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుందని, హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ఇచ్చే ఛాన్స్ వుంటుందని కేంద్రమంత్రి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016,2018 లో ప్రధాని మోదీని కోరారని, అయితే ఈ ప్రాజెక్టుకు సరైన అనుమతులు లేవని కేంద్రం పేర్కొంది.