దక్షిణ భారతం నుంచి నలుగురు అత్యంత ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు కథలు అందించడం ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామనేట్ చేసింది. ఈయనతో పాటు సుస్వరాలతో అభిమానులను అలరిస్తున్న సంగీత దిగ్గజం ఇళయరాజాను కూడా రాజ్యసభకు నామినేట్ చేసింది.
ఇక.. పరుగుల రాణి పీటీ ఉష, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ధర్మస్థళ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గేలను కూడా కేంద్రం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామనేట్ చేసింది. వీరందరూ కూడా తమ తమ రంగాల్లో విశేష ప్రభతిను కనబరుస్తున్నారని, ఆయా రంగాల ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారని, అందుకే రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో ఇళయ రాజా తమిళనాడు, విజయేంద్ర ప్రసాద్ ఏపీ, వీరేంద్ర హేగ్గే కర్నాటక, పీటీ ఉష కేరళకు చెందినవారు. వీరందరూ దక్షిణాదికే చెందిన వారు కావడం గమనార్హం.
రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురినీ అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతి వైభవాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు. ఇక.. సంగీత దర్శకుడు ఇళయరాజా కొన్ని తరాలుగా సంగీత ప్రియులను అలరించిన సృజనాత్మక మేధావి అని, పలు భావోద్వేగాలను అందంగా పలికించిన గొప్ప వ్యక్తి అని మోదీ ప్రశంసించారు.
ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ఎన్నో విజయాలు సాధించిన ఇళయరాజా జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. పీటీ ఉష భారతీయులందరికీ ప్రేరణ అని.. క్రీడా రంగంలో ఆమె సాధించిన విజయాలు ఎంతో అమూల్యమైనవని మోదీ పేర్కొన్నారు. ఇక.. వీరేంద్ర హెగ్గడే ఆరోగ్య, విద్య, సాంస్కృతిక రంగాల్లో ఎనలేని సేవ చేశారని, తాను ధర్మస్థల ఆలయంలో ప్రార్థన జరిపినప్పుడు ఆయన మహోన్నత సేవను చూసే అవకాశం లభించిందని ప్రధాని ప్రశంసించారు.