కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకంలో పనిచేసి, రిటైర్డ్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
దీంతో పాటు గరిష్ఠ వయోపరిమితిని కూడా సడలించింది. మూడేళ్ల సడలింపు ఇస్తున్నట్లు హోంశాఖ తన ఉత్తర్వుల్ల పేర్కొంది. అలాగే ఒక రోజు ముందే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇచ్చారు. మొత్తంగా అగ్నివీరుల ఫస్ట్ బ్యాచ్ కు ఐదేళ్ల సడలింపు లభించినట్లైంది.
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బిహార్, తెలంగాణ, యూపీ, హరియాణాలో ఆందోళనలు హింసాత్మకంగా కూడా మారాయి. పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుకూడా అంటించారు. విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ విధ్వంసం, నిరసనల కారణంగా దేశ వ్యాప్తంగా 234 రైళ్లు నిలిచిపోయాయి.