విదేశీ గడ్డపై భారత దేశంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. పెగాసస్ ఆయన ఫోన్‌లో కాదు. ఆయన మెదడులోనే ఉందంటూ విరుచుకుపడ్డారు. విదేశీ గడ్డపై ఆరోపణలు చేస్తూ భారత ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడటం రాహుల్‌గాంధీకి పరిపాటిగా మారిందన్నారు.
అబద్ధాలు చెప్పి భారత్ పరువు తీయడం రాహుల్ గాంధీకి అలవాటే అని, నిన్నటి ఫలితాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు. ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. ఇటలీ ప్రధాని చెప్పిన మాటలు తాను (రాహుల్ గాంధీ) విని ఉండకపోవచ్చని… ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోదీని ప్రేమిస్తున్నారని ఆయన అన్నారు. తన విదేశీ స్నేహితుల ద్వారా దేశం పరువు తీసేందుకు తరచూ ప్రయత్నిస్తుంటారని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా తనపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ఉపయోగించిందని దుయ్యబట్టారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలోని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ 21 వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే అంశంపై మాట్లాడారు. తనతో పాటు మరికొంత నేతలపై కూడా కేంద్రం పెగాసస్ ఉపయోగించిందని రాహుల్ ఆరోపించారు.
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము అని పేర్కొన్నారు. తన ఫోన్లో పెగాసస్ స్పైవేర్ చొప్పించారని, చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలోనూ పెగాసస్ ఉందంటూ పేర్కొన్నారు. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ లోని కొందరు అధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. దేశంలో మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి, నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇతరులపై నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు.