బిహార్ లో జేడీయూ, బీజేపీ బంధం తెగిపోయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, సహాయంతో నితీశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ ఆర్జేడీని ఎద్దేవా చేశారు. లాలూజీ… ఇప్పుడు మీ ఇంట్లోకి మళ్లీ పాము చొరబడింది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2017 లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న నితీశ్… బీజేపీతో కలిసి ప్రభుత్వాన్న ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా పాత మిత్రుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ట్వీట్ చేశారు. నితీశ కుమార్ ఓ పాము లాంటివాడని, పాము ఎలాగైతే.. కుబుసం విడుస్తోందో… నితీశ్ కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి కుబుసం విడిచి, కొత్త చర్మం ధరిస్తారు. అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ నితీశ్ పై విరుచుకుపడ్డారు. దీనిని గుర్తు చేస్తూనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పై ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేసేశారు. గవర్నర్ ఫాగు చౌహాన్ ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బుధవారం ఉదయం సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.