తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. 8 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ ఒక్క రోజు కూడా సచివాలయానికి వెళ్లలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత సభ యాదగిరి గుట్ట నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వమేనని, అవినీతికి ప్రతిరూపం టీఆర్‌ఎస్ అని , సీఎం అహంకారానికి తెలంగాణ బలవుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను వ్యతిరేకించిన వారే… ఇప్పుడు సీఎం కేబినెట్ లో మంత్రులై కూర్చున్నారని కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ సర్కార్ అబద్ధానికి పెద్దబిడ్డ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వచ్చే జన్మలో కేంద్ర రాజకీయాల గురించి ఆలోచిస్తే బాగుటుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలులో సీఎం కేసీఆర్ కి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి గుట్ట వరకూ ఎంఎంటీఎస్ విస్తరిస్తామని కేంద్రం ప్రకటించిందని, అయినా… 2 వ ఫేజ్ కు కేసీఆర్ ప్రభుత్వం డబ్బులే విడుదల చేయలేదని ఆరోపించారు. నెలలో 20 రోజులు ఫాం హౌజ్ లో వుంటారని, మిగతా రోజుల్లో కేంద్రాన్ని విమర్శిస్తుంటారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.