గన్నవరంలో వైసీపీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు ధ్వంసం చేసిన టీడీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వైసీపీ నేతలు పక్కా ప్లాన్ తోనే టీడీపీ ఆఫీసును ధ్వంసం చేశారని ఆరోపించారు. పెట్రోలు, రాళ్లతో వచ్చి దాడులు చేశారని విమర్శించారు. మొత్తం ఐదు కార్లు, రెండు బైకులను ధ్వంసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని.. టీడీపీ ఆఫీసులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు.
కొంత మంది పోలీసుల వల్లే సమస్యలు వస్తున్నాయని, గన్నవరం పాక్ లో వుందా? తనను పర్యటించొద్దనడానికి పోలీసులెవరు? అంటూ మండిపడ్డారు. పోలీసులు చేసిన సిగ్గుమాలిన పనిని ఎవ్వరూ హర్షించరన్నారు. బాధ, ఆవేదనతో ప్రశ్నిస్తున్నానని.. ఇకనైనా మారండి అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దొంగాటలు వద్దు, లగ్నం పెట్టుకుందాం… తాడోపేడో తేల్చుకుందా… ధైర్యం వుంటే పోలీసులు లేకండా సైకోని కూడా తీసుకురండి అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బరితెగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
తాను ప్రజా సంక్షేమం, అభివృద్ది కోసమే అనునిత్యం పనిచేశానని చంద్రబాబు అన్నారు. తమ ఆస్తులపై దాడి చేసి.. తిరిగి కేసులు ఎలా పెడతారని నిలదీశారు. పోలీసులు మొదట్లోనే వైసీపీ నేతల దౌర్జన్యాన్ని అడ్డుకుని ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. వైసీపీ నేతల్ని తరిమికొట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.