టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాశారు. అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంట్ లో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలుగు వారందరూ అల్లూరిని స్మరించుకోవడం గర్వంగా వుందన్నారు. ఈ వేడుకల్లో అల్లూరిని చేర్చినందుకే కేంద్రానికి ధన్యవాదాలు ప్రకటించారు. భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి వుంటుందని చంద్రబాబు అన్నారు.
స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటంలో అల్లూరి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని, ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిల్చారని గుర్తు చేసుకున్నారు. నేటికీ ఆ ప్రాంతాల్లో అల్లూరి పేరు మారు మోగుతూనే వుంటుందన్నారు. గతంలో ఎన్డీయే సర్కార్ పార్లమెంట్ లో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని పేర్కొందని, కానీ.. ప్రభుత్వాలు మారడంతో జాప్యం జరుగుతోందన్నారు. ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా వున్నాయని, అందుకు పార్లమెంట్ లో అల్లూరి విగ్రహం పెట్టాలని చంద్రబాబు లేఖలో అభ్యర్థించారు.