అగ్రరాజ్యం అమెరికా తమ బెలూన్ను కూల్చివేయడంపై డ్రాగన్ ఘాటుగా స్పందించింది. పౌర గగన నౌక కూల్చివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనికి అమెరికా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనని ఆరోపించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బెలూన్ సంచరించిన ఘటనను అమెరికా ప్రశాంతంగా డీల్ చేయాలని కోరుకున్నట్లు తెలిపింది. తమ గగనతలంలో తిరుగుతున్న చైనా నిఘా బెలూన్ను అమెరికా కూల్చివేసింది. దక్షిణ కరోనలీనా తీరానికి దగ్గర్లో దాన్ని కూల్చివేసినట్లు పెంటగాన్ తెలిపింది. దాని శకలాలు అట్లాంటిక్ సముద్రంలో పడిపోయాయని, బెలూన్ శిథిలాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. మోంటానా రాష్ట్రంలోని సున్నిత స్థావరాల గగనతలంపై నిఘా బెలూన్ను గుర్తించినట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
