దేశ వ్యాప్తంగా జైళ్లలో 6.10 లక్షల మంది వున్నారని, వారిలో 80 శాతం మంది విచారణ ఖైదీలేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఎలాంటి విచారణ లేకుండా లక్షల మంది జైళ్లలో మగ్గడానికి కారణమైన న్యాయప్రక్రియను ప్రశ్నించాలని అన్నారు. న్యాయాన్ని పొందడం కూడా దేశంలో ప్రాథమిక హక్కేనని ప్రకటించారు. నల్సా ఆధ్వర్యంలో జైపూర్ లో 18 వ అఖిల భాతర న్యాయసేవల సంస్థల సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. జైళ్లు చీకటి కేంద్రాలని, అందులో వున్న వారిని ఎవరూ చూడరని, వారి గోడును కూడా వినేవారే లేరన్నారు. క్రిమినల్ న్యాయ వ్యవస్థలో విచారణ ప్రక్రియే ఓ శిక్షగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. విచక్షణా రహితంగా అరెస్టులు చేయడం, దగ్గరి నుంచి బెయిల్ పొందడం వరకూ శిక్షలాగే వుండిపోతోందన్నారు. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఒక సంపూర్న ప్రణాళిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక దేశంలో ప్రతిపక్షాలకు అవకాశాలు కూడా రావడంలేదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్స నాయకుల పాత్ర చాలా కీలకంగావుండేదని, ప్రభుత్వం, ప్రతిపక్షం పరస్పరం గౌరవించుకునేలా వ్యవహరం వుండేదని గుర్తు చేసుకున్నారు. సమగ్రంగా చర్చలు, పరిశీలనలు లేకుండానే బిల్లులు ఆమోదం పొందేస్తున్నాయని, అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విరోధులుగా మారుతున్నారని, ఇది సరైన వాతావరణం కాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.