కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మల్లు భట్టివిక్రమార్క బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు వస్తే.. మొత్తం తెలంగాణకే అవమానం జరిగినట్లా? అంటూ నిలదీశారు. నోటీసులివ్వడం కవితకే అవమానం కానీ… తెలంగాణకు ఎంత మాత్రమూ కాదంటూ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే రాష్ట్రంలో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కీ, వేధించడానికి అసలు సంబంధమే లేదన్నారు. అంతకు ముందు సోనియా, రాహుల్ కి కూడా నోటీసులిచ్చారని, వాళ్లది లిక్కర్ స్కాం కాదన్నారు. ఆ తర్వాత వారికి సీబీఐ, ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు.
ఈ లిక్కర్ స్కాంలో ఎంత పెద్దవారున్నా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఇక… సీఎం కేజ్రీవాల్ పై కూడా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గాంధేయవాదినంటూ కేజ్రీవాల్ గొప్పలు చెబుతుంటారని, కానీ… లిక్కర్ స్కామ్ పై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు రాజీనామా చేసేశారని, సీఎం కేజ్రీవాల్ కూడా రాజీనామా చేయాలని సూచించారు. అవినీతి చేసింది ఎంత పెద్దవాళ్లైనా దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని, లిక్కర్ స్కాంలో ఎవరినీ వదిలిపెట్టొద్దని సూచించారు. దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేపట్టాలని వెల్లడించారు.