శ్రీ సత్యసాయి సాయి జిల్లా తాడిమర్రి మండలం సమీపంలో ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడి, 8 మంది సజీవ దహన ఘటనపై ఏపీ సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా వుంటామని భరోసా కల్పించారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటనలో వున్నారు. అయినా… సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మరో వైపు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సమాచారం సేకరించాలని రాజ్ భవన్ అధికారులను ఆదేశించారు.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ వైర్ విద్యుత్ తీగ అకస్మాత్తుగా తెగిపడింది. దీంతో 8 మంది కూలీలు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ సమయంలో మొత్తం ఆటోలో 11 మంది ప్రయాణిస్తున్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తాడిమర్రి మండలం పెద్దకోట్ల పంచాయతీ గ్రామానికి చెందిన 11 మంది కూలీలు పనుల నిమిత్తం కునుకుంట్ల గ్రామానికి బయలుదేరారు.