గోదావరి వరదలు, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించడానికి వరద ప్రభావిత జిల్లాలకు సీనియర్ అధికారులను సీఎం జగన్ నియమించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రవీణ్ కుమార్, ఏలూరుకు కాటమనేని భాస్కర్ ను నియమించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని, హైఅలర్ట్ గా వుండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం జగన్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఎలాంటి సహాయం అడిగినా.. వెంటనే ఇవ్వాలని సీఎం జగన్ సీఎస్ ను, ఆయా శాఖల అధికారులకు సూచించారు.