గోదావరి ముంపు గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా లంక గ్రామాలతో పాటు వరద ప్రభావం వున్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు. ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం, లంక గ్రామాలు, యానాం ప్రాంత పరిస్థితులను హెలికాప్టర్ ద్వారా రెండు గంటల పాటు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోవరద పరిస్థితులు, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. గట్టు బలహీనంగా వున్న చోట్ల గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద బాధితులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలన్నారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో వుంచాలని, ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆలుగ్డలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయ, పాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే సహాయ శిబిరాల్లో వుండే వారికి ప్రతి కుటుంబానికీ 2 వేలు అందించాలన్నారు.