పోరాట యోధుల్లో అల్లూరి సీతారామ రాజు ఓ అగ్నికణమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అల్లూరి జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. అల్లూరి సీతారామ రాజు 125 వ జయంత్యుత్సవాల్లో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. తెలుగు జాతికి, భారతావణికి అల్లూరి గొప్ప స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఆయన ఘనతను గుర్తుంచుకునే ఆయన పేరుపై జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచే వుంటుందని జగన్ పేర్కొన్నారు.
అల్లూరి అడవి బిడ్డల ఆరాధ్య దైవమని, ఆయన వ్యక్తిత్వానికి, గొప్పతనానికి, త్యాగానికి గొప్పగా నివాళులర్పిస్తున్నామన్నారు. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని తరతరాలకు సందేశమిచ్చేలా బతికారని, చిన్న వయస్సులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహా మనిషి అని అన్నారు. అల్లూరి తెలుగు జాతి ఎన్నటికీ మరిచిపోదని, అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న గొప్ప వీరుడికి వందనం అంటూ సీఎం జగన్ మాట్లాడార. అల్లూరి చరితార్థుడని, అతని త్యాగం అందరి గుండెల్లో నిలిచే వుంటుందన్నారు.