ప్రతి పేదింటి బిడ్డా చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ తాపత్రయమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. చదువుల కోసం ఏ కుటుంబమూ అప్పుల పాలు కాకూడదని, పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే అని సీఎం జగన్ అన్నారు. బాపట్లలో సీఎం జగన్ 2022 ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి చెందిన ఫీజు రియింబర్స్ మెంట్ నిధులను విడుదల చేశారు. 694 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేశారు. తమ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటి వరకూ 11,715 కోట్లు నేరుగా అందించామని, గత ప్రభుత్వం అలాగే వుంచిన బకాయిలను కూడా చెల్లించామని వివరించారు. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం చేసుకున్నామని, ఇంగ్లీష్ మీడియం కోసం బైజ్యూస్ తో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు.
తమ ప్రభుత్వ పథకాలపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పాలనతో రాష్ట్రంలో కేవలం నలుగురు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. పిల్లల ఫీజు ఎంతైనా కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అందులో భాగంగా ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రియింబర్స్ మెంట్ మూడో విడత కింద విడుదల చేశామన్నారు. 694 కోట్లను వారి తల్లుల ఖాతాలో జమ చేశామని, దీని ద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులు బాగుపడ్డారని సీఎం జగన్ పేర్కొన్నారు.