ఓ మనిషికి చదువే నిజమైన ఆస్తి అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చదువులు ఎక్కువగా వుండే దేశాల్లో ఆదాయమూ ఎక్కువగానే వుంటుందని గుర్తు చేశారు. ఏపీలో ప్రతి ఇంటా నాణ్యమైన చదువులు వుండాలని జగన్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో తమ హయాంలో విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని ఆయన పేర్కొన్నారు.శ్రీకాకుళం జిల్లాలో జరిగిన అమ్మ ఒడి మూడో విడత నిదుల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితులతో పిల్లలను చదివించలేని పరిస్థితి ఎవ్వరికీ శాపం కాకూడదని, పిల్లలను బాగా చదివించినప్పుడే వాళ్ల జీవితాలు మారుతాయని అన్నారు. మనిషి తలరాతను మార్చే శక్తి చదువుకు వుందన్నారు. ప్రతి ఇంట్లోని బిడ్డకు చదువు అందాలన్నదే తమ తపని అని అన్నారు.
పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి పేద తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని, దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తున్నామని గుర్తు చేశారు. 40 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6,595 కోట్లు జమ చేస్తున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ చదువు ఆపకూడదన్నదే తమ తపన అని, బాగా చదవాలన్న కోరికతోనే 75 శాతం హాజరు తప్పనిసరి చేశామని సీఎం జగన్ ప్రకటించారు.