ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు జగన్ ప్రభుత్వం భారీ ఝలక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రిందటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. జీపీఎఫ్, మెడికల్ బిల్లులు , డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల చెల్లింపులో జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఈ మేరకు గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు పంపింది. మీడియాలో, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులిస్తున్నట్లు కూడా ప్రకటించింది. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలు వుండగా…. గవర్నర్ ను ఎందుకు కలిశారంటూ సూటిగా నోటీసుల్లో ప్రశ్నించింది.
అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రశ్నించింది. వారం రోజుల్లోగా తమకు సమాధానం చెప్పాలంటూ గడువు విధించింది. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై గవర్నర్ కి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టంగా తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసుల జారీ నేపథ్యంలో…ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే… దీనిపై ఇప్పటి వరకూ ఉద్యోగుల సంఘం నేతలు స్పందించలేదు. ఒకవేళ సరైన విధంగా ఉద్యోగుల సంఘం జవాబివ్వకుంటే మాత్రం… సంఘం నేతలు ఇరుకున పడటం ఖాయం. వారి సంఘం గుర్తింపు కూడా రద్దయ్యే ప్రమాద ఘంటికలున్నాయి.
ఈ నెల 19వ తేదీన జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్ కు ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లారు. ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ, వారితోపాటు మరో ఆరుగురు గురువారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేక పోతోందంటూ ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.