కడప జిల్లా సున్నపురాళ్ల పల్లిలో స్టీల్ ప్లాంట్ కి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. జిందాల్ చైర్మన్ సజ్జన్ జిందాల్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అమర్నాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా చిన్న కార్యక్రమంలా పరిశ్రమ భూమి పూజ చేస్తున్నామని వివరించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందన్నారు. గతంలో తన తండ్రి వైఎస్సార్ ఈ స్టీట్ ప్లాంట్ కోసం కలలు కన్నారని, కానీ… తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. అయితే.. దేవుడి దయ వల్ల నేడు జిందాల్ స్టీట్ ప్లాంట్ ఏర్పాటు అవుతోందన్నారు.
స్టీల్ ప్లాంట్ 8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ అవుతుందని సీఎం జగన్ వివరించారు. గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా అవుతుందని, తొలి విడతలో 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుందని సీఎం జగన్ వివరించారు. స్టీల్ ప్లాంట్ ద్వారా రాయల సీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమైందన్నారు. కడప సిగలో మరో కలికితు రాయి వచ్చి చేరుతోందన్నారు.
మూడు దశల్లో జిందాల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు. 36 నెలల్లో 3300 కోట్లతో మొదటి దశ… మరో ఐదేళ్లలో మొత్తం పరిశ్రమ నిర్మాణం పూర్తి అవుతుందని ప్రకటించారు. 4 వేల కోట్లతో 3500 ఎకరాల భూమి, 700 కోట్ల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. దీని ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. గడచిన మూడేళ్లలో పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, దేశ వ్యాప్తంగా ఎంతో మంది పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారని తెలిపారు. జిందాల్ పరిశ్రమ కోసం తమ ప్రభుత్వం పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.