ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రోజు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధికి సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు.
ఉపాధి హామీ పనులకు సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు సుమారు 2,500 కోట్లు వున్నాయని, వెంటనే చెల్లించాలని కోరారు. అలాగే… తమ తప్పు లేకున్నా… రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని జగన్ సూచించారు. దీంతో పాటు తెలంగాణ డిస్కంల నుంచి తమకు రావాల్సిన 7,058 కోట్లను వెంటనే ఇప్పించాలని సూచించారు. అలాగే 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద 36,625 కోట్ల రూపాయలు పెండింగ్ లో వున్నాయని, వాటిని విడుదల చేయాలని కోరారు.. ఇక.. పోలవరం ముందుకు సాగడానికి అడహాక్ గా 10 వేల కోట్లను మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని సమస్యలు, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలకు ఏపీకి సహకరించాలని సీఎం జగన్ కోరారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందస్తుగా పదివేల కోట్లు మంజూరు చేయాలని కూడా కోరారు. పోలవరం కోసం తమ సొంత ఖజానా నుంచి 2600.74 కోట్లు ఖర్చు చేశామని, గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్ లోనే వున్నాయని పేర్కొన్నారు.