వరదల సమయంలో అధికారులంతా బ్రహ్మాండంగా పనిచేశారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కితాబునిచ్చారు. గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో హడావుడిగా అధికారులను సస్పెండ్ చేసేవారని పరోక్షంగా చంద్రబాబును దెప్పి పొడిచారు. విపత్తుల సమయంలో అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతూ వుండటం వల్లే పునరావాస పనుల్లో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ రాజమహేంద్ర వరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం కనుగోవాలని సీఎం అధికారులకు సూచించారు.
1986 వరదల తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చిందని, దీనికి అనుగుణంగా చర్యలు ఉండాలన్నారు. ఏటిగట్లు ఎక్కడెక్కడ బలహీనంగా వున్నాయో గుర్తించాలని, శాశ్వత చర్యలపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కరకట్టల ఆధునికీకరణ, డెల్టా ఆధునికీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం డీపీఆర్ పై టెక్నికల్ ఎస్టిమేట్స్ తయారు చేసి, వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
వరదల కారణంగా నష్టం వాటిల్లిన కుటుంబాల నమోదు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఈ నమోదు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా సాగాలని స్పష్టం చేశారు. నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత, సామాజిక తనిఖీలు నిర్వహించాలని, అర్హత వుండి సాయం అందని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. రెండు వారాల్లోగా నష్టాల నమోదును పూర్తి చేద్దామని అన్నారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే, ఆ సీజన్ లోనే పరిహారాన్ని ఇచ్చేట్లు వుంటే ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు.