వేసవిలో విద్యుత్ కొరత అనేది వుండకూడదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ కొరత కారణంగా కరెంట్ కోతలు అన్న సమస్యే ఉత్పన్నం కావొద్దని అధికారులను ఆదేశించారు. అధికారులు సిద్ధంగానే వుండాలని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేయాలని ఆదేశించారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని సూచించారు. అయితే… ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకున్న 1.06లక్షల కనెక్షన్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని అధికారులు తెలియజేశారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లకు పైగా మంజూరు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న ఉద్దేశంతో ఆ రకంగానే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.