‘జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష’ కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూరక్ష సమగ్ర సర్వే ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగుతాయని సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ భూ వివాదాలను పరిష్కరించడానికి ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇవన్నీ శాశ్వత పరిష్కారంగా వుండాలని స్పష్టం చేశారు. సర్వే సందర్భంగా తలెత్తే వివాదాల పరిష్కారానికి కూడా సరైన యంత్రాంగం వుండాలని నొక్కి చెప్పారు. వివాదాల్లో వుండి తరతరాలుగా భూమిపై హక్కులు పొందలేని దుస్థితి నుంచి బయట పడాలన్నారు.
ఇక…. భూ వివాదాల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ వుండాలని, మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు వుండాలని ఈ సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా ఓ వ్యక్తి తమ భూమిలో సర్వే కావాలని దరఖాస్తు చేసుకుంటే.. కచ్చితంగా అధికారులు సర్వే చేయాలని, నిర్ణీత సమయంలో గనక సర్వేలు చేయకుంటే… అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం జగన్ తేల్చి చెప్పారు. సర్వేలో ఏరియల్ ఫ్లైయింగ్, డ్రోన్ ఫ్లైయింగ్ నెలవారీ లక్ష్యాలను కూడా పెంచాలని, వెయ్యి గ్రామాల కంటే కాస్త అధికంగా చేయాలని సీఎం జగన్ సూచించారు.