పోలవరం ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తి అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పోలవరం అనే పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకి లేదన్నారు. సీఎంగా పనిచేసినప్పుడు ఆయన నోటి వెంట పోలవరం పేరు ఒక్కసారైన రాలేదని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలవరంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. 1995 నుంచి 2014 వరకూ చంద్రబాబు నోటి వెంట పోలవరం అనే పేరు ఒక్కసారైనా రాలేదని, వారి హయాంలో పోలవరం నిధులను యథేచ్ఛగా దోచేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో ఎక్కువగా డబ్బు పంచే పనులను ముందు చేశారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. స్పిల్ వే పనుల్ని అసంపూర్ణంగా.. పునాది స్థాయిలోనే వదిలేసి… ఏకంగా కాఫర్ డ్యాం పనుల్ని మొదటు పెట్టేశారన్నారు. కాఫర్ డ్యామ్ లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, అప్రోచ్ ఛానల్ పనులు కూడా జరగలేదని విమర్శించారు. అసలు స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం పనుల్ని ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదన్నారు.
టీడీపీ ఇంజినీరింగ్ అంటే ఎలా వుంటుందో ఇదే నిదర్శనమని సీఎం జగన్ దెప్పిపొడిచారు. అయితే.. కొన్నిమీడియా సంస్థలు మాత్రం చంద్రబాబే పోలవరంను చేశారంటూ తప్పుడు వార్తలు వస్తున్నాయని ఆక్షేపం వ్యక్తం చేశారు. దానిని ఎవరూ నమ్మవద్దని కోరారు. పోలవరాన్ని ప్రారంభించింది తన తండ్రి వైఎస్సార్ అని, దానిని పూర్తి చేసేది తానేనని ప్రకటించుకున్నారు. రివర్స్ ట్రెండింగ్ ద్వారా 800 కోట్లను ఆదా చేశామని, తమ హయాంలోనే ఇప్పటికే స్పిల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తైందని పేర్కొన్నారు.