ఏపీ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథమని నిరూపించామని పేర్కొన్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎంత ముఖ్యమో.. తమకు వ్యవసాయ రంగం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో… అవ్వాతాతలు కూడా అంతే ముఖ్యమన్నారు. పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా నాలుగు సంవత్సరాలు పాలించామని, మేనిఫెస్టోలో చెప్పిన 98.5 శాతం హామీలు అమలు చేశామన్నారు.
కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా… పథకాలు అమలు చేశామని, అందరికీ మంచి చేశామన్నారు. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించామన్న విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నామన్నారు. అర్హులందరికీ పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని, తంలో 39 లక్షల మందికి రూ. 1000 మాత్రమే పెన్షన్ అందేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2750 పెన్షన్ ను 64 లక్షల మందికి అందిస్తున్నామని వివరించారు. ఏపీ మాదిరిగా పెన్షన్ అందిస్తున్న విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇక రెషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచామని జగన్ తెలిపారు. ఏపీ తరహా రెషనింగ్ దేశంలో మరెక్కడ కూడా లేదన్నారు.