బీసీలంటే వెన్నెముక కులాలని మూడున్నరేళ్ల మన పాలనలో చాటిచెప్పామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 85 వేల మంది బీసీలకు రాజకీయ సాధికారత కల్పించామని, బీసీలకు బడ్జెట్ లో కాదు, గుండెల్లో స్థానమిచ్చామని ప్రకటించారు. విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభలో సీఎం జగన్ ప్రసంగించారు. నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలని కొనియాడారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదని, బ్యాక్ బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని, వెన్నెముక కులాలని అభివర్ణించారు. ఈ విధానాన్ని చాటి చెప్పేందుకే తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. బీసీ కులాలన్నింటికీ న్యాయం చేస్తామని పాదయాత్ర సమయంలో ప్రకటించామని, దానికి తగ్గట్టుగానే రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశామని చెప్పారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ ను తెచ్చామని, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని సీఎ తెలిపారు. శాసన మండలిలో వైసీపీ 32 మంది సభ్యుల్లో బీసీలే అధికంగా వున్నారని, మండల పరిషత్ పదవుల్లో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని అన్నారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే వున్నారని తెలిపారు. 86 శాతం మేయర్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే వున్నారని పేర్కొన్నారు.