ఏపీలో పెట్టుబడుల కోసం విశాఖ వేదికగా జగన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతమైంది. సదస్సులో రెండో రోజు ఏపీ ప్రభుత్వంతో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దాదాపు 1.15 లక్షల కోట్లు విలువైన 248 ఒప్పందాలు పలు కంపెనీలతో జరిగాయి. రెండో రోజు ఒప్పందంలో రిలయన్స్ కంపెనీ 50 వేల కోట్ల రూపాయలతో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. 2రోజుల సదస్సు ద్వారా ఏపీకి 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకువచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ విజయవంతం కావడానికి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. గత మూడున్నరేళ్లలో రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని వివరించారు. కోవిడ్ కష్టాలను కూడా అధిగమించామని, కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. కీలకమైన సమయంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించామని, పారదర్శక పాలనతో విజయవాలు సాధిస్తున్నామని తెలిపారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని, ఏపీ అభివృద్ధికి ఈ 15 సెషన్స్ ఎంతో కీలకమని సీఎం జగన్ వివరించారు. ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయని, వందకు పైగానే స్పీకర్లు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మొత్తం 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. దాదాపు 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లయ్యిందని వివరించారు. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలోనే వచ్చాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ఒప్పందం ఓ కీలక మలుపుగా అభివర్ణించారు.
అందరి సహాయ సహకారాలతో ఏపీని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని సీఎం జగన్ ముగింపు సదస్సులో తెలిపారు.