భవిష్యత్తుపై చిత్తశుద్ధి వున్న పార్టీ వైసీపీ అని ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడు, సీఎం జగన్ ప్రకటించారు. వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాల్లో భాగంగా సీఎం జగన్ ప్రసంగించారు. కార్యకర్తలు 13 సంవత్సరాలుగా తనపై ఇదే అభిమానాన్ని చూపుతున్నారని, వారందరికీ సెల్యూట్ అంటూ ప్రకటించారు. శాశ్వత అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు కార్యకర్తలు, నేతలందరికీ జగన్ ధన్యవాదాలు ప్రకటించారు. పార్టీని గట్టి పునాదిపై నిర్మించుకున్నామని, కార్యకర్తల కష్టాల పునాదులపైనే ప్రభుత్వం ఏర్పడిందని ప్రకటించారు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో.. అదే చేస్తున్నామని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి తనపై కేసులు పెట్టాయని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి కూడా తెచ్చాయన్నారు. తమకు అన్యాయం చేసిన పార్టీల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 2014 లో ఓడినా.. తనపై కుట్రలు, కుతంత్రాలను ఆపలేదని, 23 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను కొన్నారని సీఎం మండిపడ్డారు.
వైసీపీ పార్టీ వుండకూడదని కొందరు కుట్రలు కూడా పన్నారని, తమ దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలనైతే కొన్నారో.. వారికి అన్నే సీట్లు వచ్చాయని చురకలంటించారు. దేవుడు రాసే స్క్రిప్ట్ భలే వుంటుందని, ఎప్పటికైనా మంచే గెలుస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మూడేళ్లు కూడా సుపరిపాలన అందించడానికే ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కునే పనిపై కన్నేయలేదని ఘాటుగా విమర్శలు చేశారు.