వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసమే వైసీపీ ఆవిర్భవించిందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2009 సెప్టెంబర్ 25 న పావురాల గుట్టలో సంఘర్షణ మొదలైందని, ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపు దాల్చిందని గుర్తు చేసుకున్నారు. రెండు రోజుల పాటు జరుగున్న వైసీపీ ప్లీనరీ వేదికగా సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. తనను ప్రేమించి, తనతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
13 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, తన తండ్రి ఇచ్చిన జగమంత కుటుంబం తన చేయి ఎప్పుడూ వదల్లేదని అన్నారు. మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారని, ఏకంగా 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. ప్రతిపక్షాన్ని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారని అన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి వుండే పార్టీ వైసీపీ అని సీఎం జగన్ అన్నారు. ఈ మూడేళ్ల ప్రయాణం ఎన్నో పోరాటాల ప్రస్థానమని, రైతులపై మమకారం అంటే ఇలా వుంటుందని నిరూపించామని పేర్కొన్నారు. తమపై ఎన్ని రాళ్లు పడ్డా, ఎన్ని నిందలు పడ్డా.. ఎదుర్కోన్నామని, ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని దాడులు చేసినా.. గుండె చెదరలేదని ప్రకటించారు. తమ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం ఆగిపోయిందని, అందుకే గజ దొంగల ముఠాకు నిద్రపట్టడం లేదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
దుష్ట చతుష్టయం తమ పాలనలో జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేకపోతోందని, అందుకే అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 14 ఏళ్లుగా సీఎం చేసిన చంద్రబాబు ఇవ్వాళ నోరు పారేసుకుంటున్నారని, కట్టు కథల్ని జోడించి ఎల్లో మీడియా తెగ ప్రచారం చేస్తోందని మళ్లీ మండిపడ్డారు. వైసీపీ ఎప్పుడూ జనం వెంటే వుంటుందని, జనం గుండెల్లో వుంటుందన్నారు. గజ దొంగల ముఠా మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే వుంటుందని సీఎం జగన్ ఫైర్ అయ్యారు.