మూగ జీవాలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తీసకొచ్చిన వైఎస్సార్ సంచార పశువుల అంబులెన్స్ లను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. అయితే.. ఇప్పటికే ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ చొప్పున 129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అంబులెన్స్ ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 155251 ను అనుసంధానించారు. ఈ నెంబర్ల ద్వారా అంబులెన్స్ ను వినియోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్ లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకులు, డ్రైవర్, అంటెడర్ వుంటారని అధికారులు తెలిపారు. ప్రతి అంబులెన్స్ లో కూడా 35 వేల విలువైన 81 రకాల మందులు కూడా అందుబాటులో వుంటాయి.
వీటన్నింటితో పాటు అత్యాధునిక పరికరాలు, 1000 కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం జీవీకే-ఈఎంఆర్ఐ కి అప్పగించింది. కాల్ సెంటర్ కు సగటున 1,500 చొప్పున 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. 2,250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటి వరకు 6,345 కి పైగా మేజర్, 10,859 మైనర్ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మూగ జీవాలకు వెంటనే చికిత్స అందించేందుకు తొలి విడత అంబులెన్స్ లను జగన్ గతంలో ప్రారంభించారు. 240 కోట్ల రూపాయలు వెచ్చించి మొత్తం 340 అంబులెన్స్ లను పశువుల వైద్యం కోసమే ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ లు గ్రామాల్లో పర్యటించి పశువులకు వైద్యం అందించనున్నారు.