ఏపీలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 48 గంటల్లో ప్రతి ఇంటికీ 2 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాల్సిందేనని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆర్థిక సహాయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కావొద్దని ఆదేశాలిచ్చారు. 2 వేల ఆర్థిక సహాయంతో పాటు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, ఆలుగడ్డలు, ఉల్లిపాయ, లీటర్ పామాయిల్ 48 గంటల్లోగా బాధిత కుటుంబాలకు చేరాలని సీఎం జగన్ ఆదేశించారు.
ముంపునకు గురైన ప్రతి ఇంటికీ చేరాలని, దీన్నో సవాల్ గా తీసుకోవాలని అధికారులను సీఎం కోరారు. అందుబాటులో వున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందజేయాలని జగన్ తెలిపారు. వరద ముంపు అధికారులకు ఏం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని, పనిలో దూసుకుపోవాలని జగన్ అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పట్టించుకోకుండా ముందుకే సాగాలని, ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.