”ప్రజల్లోకి వెళితేనే టిక్కెట్లు… లేకుంటే మళ్లీ టిక్కెట్లిచ్చే సమస్యే లేదు. మొహమాటలే లేవు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్య్రక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిందే. రేపు ఎన్నికలప్పుడు టిక్కెట్ రాకపోతే ఫీల్ కావొద్దు. ఇప్పుడే చెబుతున్నా”… అంటూ ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన సదస్సులో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వం విషయం కింద ఇంకా తిరగని ఎమ్మెల్యేలపై సీఎ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెళ్లని వారు ఇప్పటికైనా వెళ్లాలని, ఇంకా సమయం మించిపోలేదని, గడప గడపకూ అందరూ వెళ్లాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలందరూ కష్టపడితేనే.. 175 కి 175 స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయన్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలన్నారు. జీవితంలో ఏ కార్యక్రమమైనా.. చిత్తశుద్ధితో చేస్తేనే నిలదొక్కుకుంటామని పేర్కొన్నారు. ప్రజల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టామని, రాష్ట్రంలోని చాలా కుటుంబాలు వైసీపీ ప్రభుత్వంపై ఆధారపడి వున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కష్టపడాల్సిందేనన్నారు. ఇప్పటికీ కొందరు గడప గడపకు అన్న కార్యక్రమంలో పాల్గొనలేదని, ఇదేం పద్ధతి అంటూ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్ అని, ప్రజాభిప్రాయం మేరకే టిక్కెట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పారు.