తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు బాగా కుర్తుస్తున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయాలని, తక్షణ చర్యలు కూడా తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి, అన్ని జిల్లాల కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
వరద ముంపు ప్రాంతాల్లోని అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేయాలని కోరారు. అయితే తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తానే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటానని సీఎం ప్రకటించారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులందరూ ప్రజలకు అందుబాటులో వుండాలని సీఎం ఆదేశించారు. రక్షణ చర్యల్లో పాల్డొనాలని వారికి సూచించారు.
ఈ నెల 11 న ప్రగతి భవన్ లో నిర్వహించతలపెట్టిన రెవిన్యూ సదస్సుల అవగాహన సమావేశంతో పాటు రెవిన్యూ సదస్సులను మరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తేదీలను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.