పంద్రాగస్టు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.కొత్తగా10 లక్షల మందికి పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఫించను అందజేస్తున్నామని కొత్త వారితో కలుపుకొని ఆ సంఖ్య 46 లక్షలకు చేరుతుందని అన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు. అనాధ పిల్లలను స్టేట్ చిల్డ్రన్స్ గా గుర్తించడంతో పాటు వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు బీమా పథకం తీసుకొస్తామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఉచితాలు బంద్ చేయాలని కొత్త పాట మొదలు పెట్టారని, అసలు ఉచితాలు అంటే ఏంటో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తే వాటిని ఉచితాలు అంటారా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఉచితాలు వద్దంటున్న మోడీ సర్కారు ఎన్పీఏలు ఎందుకు ఇస్తోందని నిలదీశారు.